ఆలూర్ లో పదో తరగతి పేపర్ లీక్
ఉర్దూ మీడియం తెలుగు పేపర్ లీక్..
ప్రశ్న పత్రాన్ని సెల్ ఫోన్ లో ఫోటో తీసి పంపించారు..
ఉపాధ్యాయునికి స్టేషన్ లో పిలిపించి విచారణ..
స్టేషన్ కు తరలివచ్చిన పిఆర్ టియు నాయకులు..
తెలంగాణ కేసరి, ఆర్మూర్, మార్చి 19:
ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి ఉర్దూ మీడియం తెలుగు ప్రశ్నపత్రం లీక్ కావడం సంచలనం సృష్టించింది.. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆలూర్ లోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి ఆర్మూర్ స్టేషన్ నుంచి సంబంధిత అధికారులు వాహనంలో పరీక్ష పత్రాలను ఇచ్చి వెళ్లారు. కేంద్రంలోని ఒక పరీక్ష గదిలో ఉర్దూ మీడియం విద్యార్థులకు చెందిన తెలుగు పేపర్ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్ సెల్ ఫోన్ లో చిత్రీకరించి జవాబుల కోసం బయట ఉన్నవారికి పంపించాడు. సెల్ ఫోన్ లో బయట వ్యక్తులకు ప్రశ్నాపత్రం చేరడంతో వారు బోధన్ లోని తెలిసిన వారికి పంపించారు. బోధన్ లో ఉన్న వ్యక్తికి సెల్ ఫోన్ లో తెలుగు ప్రశ్నపత్రం రాగానే గ్రూపులో పెట్టడం జరిగింది. ఈ ప్రశ్నపత్రాన్ని గ్రూపులో పెట్టడంతో పేపర్ లీక్ అయినట్టు గ్రూపులో ఉన్న వారందరికీ తెలిసింది. ఈ విషయం కాస్త జిల్లా విద్యాశాఖ అధికారులకు, పోలీసు అధికారులకు తెలియడంతో ఆలూర్ పరీక్ష కేంద్రంలోనీ ఇన్విజిలేటర్ సెల్ ఫోన్ లో ఫోటో తీసి బయటికి పంపించినట్లు పోలీసులు గుర్తించి స్టేషన్ కు పిలిపించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ పరీక్షా కేంద్రానికి చెందిన డివో, చీప్ సూపర్ డెంట్ తో సహా ఉపాధ్యాయులను పిలిచి విచారణ జరిపారు. సెల్ ఫోన్ లో ఉర్దూ మీడియానికి చెందిన తెలుగు ప్రశ్న పత్రం పంపడం వలన లీకైనట్లు గుర్తించిన విద్యాశాఖ అధికారులు సీరియస్ అయి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కోరారు. దీంతో రాత్రి 9 గంటల వరకు స్టేషన్ లో విచారణ కొనసాగింది. పరీక్ష కేంద్రం నుంచి పదో తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు చెందిన తెలుగు ప్రశ్నాపత్రాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి బయటకు పంపడం వల్లనే పేపర్ లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడైన ఇన్విజిలేటర్ పాత్ర ఉందా లేదా అనే విషయమై స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలియడంతో పిఆర్ టియు నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో స్టేషన్ కు తరలివచ్చారు. సీఐ సత్యనారాయణ గౌడ్ తో నాయకులు ప్రశ్నాపత్రం లీకేజీ విషయమై చర్చించారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు చెందిన తెలుగు పేపర్ లీక్ అయిన విషయమై పోలీసులు వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఈ ప్రశ్న పత్రం లీకేజీ విషయమై లోతుగా విచారణ జరుపుతున్నారు.