మామిడి గిరిని కిడ్నాప్ చేసిన దుండగులను శిక్షించాలి
– అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్ , నల్లగొండ, నవంబర్ 30
సర్పంచ్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడే దుండగులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా యాదవ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం సర్పంచ్ అభ్యర్థిగా మామిడి లక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆమె భర్త మామిడి గిరిని అదే గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది కిరాయి వ్యక్తులతో కిడ్నాప్ చేయించి దారుణంగా హింసించడం తగదన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మూత్రం తాగించడం అతని కుల అహంకారానికి అద్దం పడుతుందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ జోక్యం చేసుకొని సందీప్ రెడ్డి కుటుంబం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఉధృతం చేసి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. మామిడి గిరి ని కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలో కూడా అణగారిన వర్గాల పట్ల అగ్రవర్ణాలు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సుభాష్ యాదవ్, గజ్జి అజయ్ యాదవ్, వెంకన్న యాదవ్, పర్వతాలు యాదవ్, కాశీ రాములు యాదవ్, కునుకుంట్ల రాజు యాదవ్, పురుషోత్తం యాదవ్, దూదిమెట్ల మహేష్ యాదవ్, శివ యాదవ్, సల్ల సైదులు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.