ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గృహజ్యోతి పథకం అమలు చేయాలి
వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం లో చీఫ్ ఇంజనీర్ కు వినతి
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 03
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు “గృహజ్యోతి పథకం” అమలు చేయాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన “విద్యుత్ వినియోగదారుల దినోత్సవం” లో చీఫ్ ఇంజనీర్ బాలస్వామి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయంలో పట్టణ ఏఈ, డీఈ కార్యాలయాలకు బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల విద్యుత్ ప్రమాదంతో మృతి చెందిన అసిస్టెంట్ లైన్ మేన్, కాంట్రాక్టు వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం అన్ని విద్యుత్ శాఖ కార్యాలయాల్లో కొత్త ఫోన్ నెంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమయపాలన పాటించే విధంగా చూడాలని కోరారు. భువనగిరి పట్టణంలోని రాంనగర్, పోచమ్మవాడ తదితర ప్రాంతాల్లో అధిక లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ అనేకమార్లు ట్రిప్ అవుతుందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. భువనగిరి పట్టణంలోని రాంనగర్ మాంటిస్సొరి పాఠశాల నుండి ఎల్ బి నగర్, హౌసింగ్ బోర్డు వరకు, అలాగే అర్బన్ కాలనీలో మరియు పగిడిపల్లిలో ఇండ్ల పై నుండి వెళుతున్న 11 కే వి విద్యుత్ వైర్లను తొలగించాలని, సీతానగర్, ఆనంతారం గ్రామంలో అదనపు విద్యుత్ పోల్స్ వేయాలని కోరుతూ వినియోగదారులు సుమారు పది వరకు వినతి పత్రాలు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ బాలస్వామి మాట్లాడుతూ ..ఇండ్ల పై వెళుతున్న 11 కేవి విద్యుత్ లైన్లు తొలగించుటకు బడ్జెట్ కొరకు జిల్లా కలెక్టర్ అనుమతి తో కలెక్టర్ ఫండ్స్, లేదా ఎమ్మెల్యే, ఎంపి ల సహకారంతో వారి నిధుల నుండి మంజూరు చేయించి తొలగిస్తామన్నారు. రైతులు విద్యుత్ ప్రమాదాల నివారణకు ఐఎస్ఐ విద్యుత్ మోటార్లు వాడాలని, ట్రాన్స్ఫార్మర్ లను ఎత్తులో ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ ను ఆదా చేయాలని కోరారు. ఈ సమావేశంలో వినియోగదారులు మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, నలమాసు వెంకటేష్, రాములు,గీస ఆనంద్, కూరెళ్ళ మల్లేష్, గుర్రాల శ్రీనివాస్, గాదె శ్రీనివాస్ , విద్యుత్ శాఖ అధికారులు చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ ఈ సుధీర్ కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, టెక్నికల్ డీఈ సుధీర్ కుమార్, ఎస్ ఏ ఓ హరీష్ కుమార్, టెక్నికల్ ఏ ఈ సదయ్య, పట్టణ ఏఈ సాయికుమార్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఇటివల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన విద్యుత్ సిబ్బందికి మౌనం పాటించి, నివాళులు అర్పించారు.