ఆపరేషన్ స్మైల్- XII లో భాగంగా 58 మంది బాలకార్మికులకు విముక్తి
ఎస్పీ రోహిత్ రాజు
తెలంగాణ కేసరి భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుండి 2026 జనవరి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలలో దాడులు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు బృందాలను ఈ దాడులను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని, నెల రోజుల పాటు జరిగిన ఈ దాడులలో భాగంగా మొత్తం 58 మంది బాలకార్మికులను పట్టుకొని వారికి విముక్తి కలిగించడం జరిగిందని తెలిపారు. ఇందులో 09 మంది బాలికలు ఉండగా 49 మంది బాలురు ఉన్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన 04 బాలికలు, 27 మంది బాలురలను గుర్తించినట్లు తెలిపారు. బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 36 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ -XII బృందం పట్టుకున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 నకు గానీ 1098కి గానీ ఫోన్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ స్మైల్ -XII నకు డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి నోడల్ అధికారిగా వ్యవహరించారు. ఆపరేషన్ స్మైల్ బృందంలో పనిచేసి బాలకార్మికులకు విముక్తి కలిగేలా బాధ్యతలు నిర్వర్తించిన షీటీం ఇన్స్పెక్షర్ రాము,ఆరెఎస్సై రమాదేవి, ఎస్సైలు విజయ, సతీష్, శ్రావణ్, రాఘవయ్య, సమ్మిరెడ్డి,లక్ష్మణ్, ఏఎస్సై నాగయ్య, పీసీలు మల్లికాంబ,రాంబాబులను ఈ సందర్బంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.