ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు
బాలల దినోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ఉపాధ్యాయులు
వ్యాసరచన, ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ చండ్రుగొండ నవంబర్ 14
భారత తొలి ప్రధాని దివంగత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం చండ్రుగొండ మండలం లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల, సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో జాతీయ బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు కలెక్టర్లు, డీఈవో, ఎంఈవో, పీడీల వేషధారణలతో అలరించారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించి విద్యార్థులను ఆకర్షించారు. అనంతరం వ్యాసరచన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉప్పల్ రెడ్డి, సిస్టర్ లత, అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ… జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 14న ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజున ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం పిల్లల హక్కులు, విద్య, సంక్షేమంపై అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ రోజున పిల్లల కోసం ఆటలు, డ్రాయింగ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు వంటివి నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

