ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి.

శాశ్వత ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు ఉత్తమ మార్గం.

సమీకృత వ్యవసాయం రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుంది

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 13

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గురువారం ఐ.డి.ఓ.సి. కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ఆయిల్ పామ్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యచరణ అవసరం అని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 23 మండలాల్లో 21,329 మంది రైతులు 83,850 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు అని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 14,500 ఎకరాల లక్ష్యంలో 8,163 ఎకరాల లక్ష్యాన్ని సాధించామని వివరించారు. జిల్లాలో ఉన్న 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (PACS) ప్రతి సంఘ పరిధిలో కనీసం 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని APC  నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ పంట రైతులకు శాశ్వత ఆదాయం అందించే పంటగా నిలుస్తుందని, దీర్ఘకాలిక ఆదాయం కోసం ఇది ఉత్తమ మార్గమని ఆయన వివరించారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 80,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతోందని, అందులో కనీసం 10,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. చిన్న, మధ్య తరహా రైతులు కనీసం ఒక ఎకరంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టి, దానితోపాటు మునగను అంతర్పంటగా సాగు చేస్తే తక్కువ కాలంలోనే అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ఆయిల్ పామ్ సాగులో ఎకరానికి 57 మొక్కలు నాటవలసి ఉంటుందని, దానికి సుమారు రూ.10,000 నుండి రూ.15,000 వరకు ఖర్చు అవుతుందని వివరించారు. అంతర్పంటగా మునగ సాగు చేపడితే ఏడు నెలల్లోనే పంట చేతికి వచ్చి ఆదాయం లభిస్తుందని తెలిపారు. “రైతులు ఆయిల్ పామ్ సాగుతో పాటు కూరగాయల సాగు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి సమీకృత వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తే ఆదాయం విభిన్న మార్గాల్లో లభిస్తుంది. ఇది రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందిస్తుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొగల్రాళ్ల గొప్ప గ్రామానికి చెందిన రైతు కొర్స వెంకటమ్మ అవలంబిస్తున్న సమీకృత వ్యవసాయ పద్ధతులను అభినందించారు. ఆమె విధానం ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేపడుతున్న ప్రతి రైతు అంతర్పంటగా మునగ సాగు తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుతో కలెక్షన్ పాయింట్ల ఏర్పాటు సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో దమ్మపేట మండలంలో ఉపగ్రహ ఆధారిత మోడల్ ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ ప్రారంభించబడిందని పేర్కొన్నారు. దీని ద్వారా మొక్కల పెరుగుదల వంటి అంశాలను సాంకేతిక పద్ధతిలో పర్యవేక్షించడం సులభమవుతుందని వివరించారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తున్నదని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపునకు వినూత్న చర్యగా, అత్యధిక ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించిన మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను గుర్తించి వారికి సోలార్ డ్రైయర్లు బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి మండలంలో ఆదర్శ రైతులను గుర్తించి, వారి విజయగాథలను ఇతర రైతులతో పంచుకోవాలి. ఆయిల్ పామ్ సాగు, అంతర్పంటలు, పశుపోషణ వంటి సమీకృత వ్యవసాయ విధానాలు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి అని కలెక్టర్ అన్నారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, గోద్రెజ్ ప్రైవేట్ లిమిటెడ్ జిల్లా ఇన్‌చార్జ్ రామకృష్ణ, జిల్లా ఉద్యానవన, వ్యవసాయ శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ మరియు గోద్రెజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe